Please enable javascript.జెప్టో ఫండింగ్: Zepto : జెప్టో లో కొత్తగా 665 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. డబుల్ అయిన కంపెనీ విలువ.. వచ్చే ఏడాది ఐపీఓ.. - zepto bags usd 665 million investments company value doubles coming to ipo next year | The Economic Times Telugu

Zepto : జెప్టో లో కొత్తగా 665 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. డబుల్ అయిన కంపెనీ విలువ.. వచ్చే ఏడాది ఐపీఓ..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 21 Jun 2024, 4:44 pm

జెప్టోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కొత్తగా 665 మిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది. దీంతో కంపెనీ విలువ డబుల్ అయింది. 3.6 డాలర్లకు చేరింది. ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు అమెరికాకు చెందిన టాప్ కంపెనీ జెప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో..

 
zepto
Representative Image
క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో కొత్తగా భారీ పెట్టుబడులను దక్కించుకుంది. 9 నెలల క్రితం యూనికార్న్ గా మారిన ఈ కంపెనీలో ఏకంగా 665 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లకు ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ అరంగేట్రం చేయాలని భావిస్తున్న ఈ కంపెనీకి ఇది భారీ బూస్ట్ అని చెప్పవచ్చు. ఈ పెట్టుబడితో కంపెనీ విలువ అతి తక్కువ కాలంలోనే డబుల్ అయి 3.6 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు కొత్త వారు కూడా జెప్టోలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. నూతనంగా ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతున్న వారిలో న్యూయార్క్ కు చెందిన ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ అవెనీర్, గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్ స్పీడ్, గ్రోత్ స్టేజ్ ఇన్వెస్టర్ అవ్రా క్యాటిపల్ వంటి సంస్థలున్నాయి. ఇక ఇప్పటికే ఇన్వెస్టర్లుగా ఉన్న నెక్సస్ వెంచర్ పార్ట్ నర్స్, గ్లేడ్ బ్రూక్, స్టెప్ స్టోన్ గ్రూప్ కూడా పెట్టుబడులను మరింత పెంచుకున్నాయి.

అవ్రా క్యాపిటల్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత జెప్టోలోనే మొదటి పెట్టుబడి పెట్టింది. ఈ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి అను హరిహరన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈయన వై కాంబినేటర్స్ గ్రోత్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు. గతంలో ఆకంపెనీకి ఎండీగా ఉన్నారు. జెప్టోలో మొదటగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో వై కాంబినేటర్స్ కూడా ఉంది.

డబుల్ అయిన కంపెనీ విలువ..
కొత్తగా వచ్చిన ఫండింగ్ తో కలిపి జెప్టో కంపెనీ విలువ 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇంతకుముందు 2023 ఆగస్టులో ఇది 1.4 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఏడాదిలోనే డబుల్ అయింది. ఈ కంపెనీ వృద్ది పట్ల ఇన్వెస్టర్లు ఎంత సానుకూలంగా ఉన్నారో ఇది సూచిస్తోంది. నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ స్టార్టప్ అనతికాలంలోనే బాగా పాపులర్ అయింది. క్విక్ ఈకామర్స్ కంపెనీగా గుర్తింపు పొందింది. హెచ్ఎస్ బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఏప్రిల్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ మార్కెట్లో జెప్టో తన వాటాను అతి తక్కువ కాలంలోనే 28 శాతానికి పెంచుకుంది. బ్లింకిట్ 40 శాతం మార్కెట్ షేర్ తో టాప్ ప్లేస్ లో ఉంది.

కొత్తగా వచ్చిన పెట్టుబడులతో జెప్టో డార్క్ స్టోర్స్ నెట్వర్క్ ను మరింత విస్తరించుకోనుంది. గ్రాసరీ, ఈ కామర్స్ ఐటెమ్స్ ను ఈ స్టోర్లలోనే భద్రపరుస్తుంది. 2025 నాటికి స్టోర్ల సంఖ్యను డబుల్ చేసి 700 కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న 350 స్టోర్లలో 75 శాతం స్టోర్లు లాభాల్లోనే ఉన్నాయి.
2021లో ప్రారంభం..
జెప్టోను 2021 లో ఆదిత్ పాలిచా, కైవాల్య వోరా స్థాపించారు. 150 మిలియన్ డాలర్లు పెట్టుబడులు దక్కించుకుని ఫేమస్ అయింది. వై కాంబినేటర్స్, నెక్సస్ వెంచర్ పార్టనర్స్ దీనిలో భారీగా ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది 200 మిలియన్ డాలర్ల ఫండింగ్ రావడంతో జెప్టో యూనికార్న్ గా అవతరించింది. స్టెప్ స్టోన్ గ్రూప్, గుడ్ వాటర్ క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్ నర్స్, గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్ వరసుగా పెట్టుబడులు పెట్టాయి. వచ్చే ఏడాది ఐపీఓ ద్వారా భారత స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలని జెప్టో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More